కసరత్తు తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సీఎం కేసీఆర్ నిర్ణయం
దాదాపు రెండు నెలల కసరత్తు తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 3:05 AM GMTకసరత్తు తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సీఎం కేసీఆర్ నిర్ణయం
దాదాపు రెండు నెలల కసరత్తు తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగా ఉన్న రెండు నామినేటెడ్ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ పేర్లును కేబినెట్ ఆమోదించింది. కేసీఆర్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో విస్తృత చర్చ తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
మే నెలలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో చోటు దక్కించుకోవడం కోసం ఆశావహులు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని విధాలా ఆలోచనలు చేసి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ ఏడాది తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయించారు. సామాజిక వర్గాల వారీగా అధ్యయనం చేసి ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
కుర్రా సత్యనారాయణ బీజేపీపై అసంతృప్తితో బీఆర్ఎస్‌లో చేరారు. గంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఇక బీసీ నేతగా దాసోజు శ్రవణ్‌కు మంచి గుర్తింపు ఉంది. దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యోమంలో కీలక పాత్ర పోషించారు. చురుగ్గా పని చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసి దాసోజు శ్రవణ్ ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి.. పొలిట్ బ్యూరో సభ్యుడి స్థాయికి ఎదిగారు. 2014లో కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి మరోసారి 2022లో ఆగస్టులో బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఉండలేక కొద్ది నెలలకే మళ్లీ బీఆర్ఎస్‌లో చేరారు దాసోజు శ్రవణ్. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా బీసీ సామాజిక వర్గాలను ఆకట్టుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కుర్రా సత్యనారాయణకు పదవి ఇవ్వడం ద్వారా ఎస్టీ వర్గాలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.