హైదరాబాద్: అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు 'రహదారి భద్రతా మాసం'ను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రవిగుప్తా ఆదేశించారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రతా మాసాన్ని పాటించాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. యువత మరణాలకు రోడ్డు ప్రమాదాలే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని చెప్పారు.
రోజురోజుకు పెరుగుతున్న వాహనాలు, ప్రయాణికులు జాగ్రత్తలు పాటించకపోవడం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, అతివేగం, ప్రమాదకర డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లలో మాట్లాడటం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2022 తెలంగాణలో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా, భారతదేశం మొత్తం మీద 1,68,000 మంది మరణించారని రవి గుప్తా తెలిపారు.
హైవేలు ఉన్న ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్బులు ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. పోలీసు కార్యాలయాల్లో జిల్లా రోడ్డు సేఫ్టీ బ్యూరోలు, కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరోలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే చలాన్ ఫైన్ ఫండ్స్ ద్వారా స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి ‘ గుడ్ సమారిటన్’ పేరిట సన్మానం చేయాలని తెలిపారు. ఇలాంటి చర్యలను ఈ నెలకే పరిమితం చేయవద్దని, దీర్ఘకాలికంగా కూడా ఈ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు డీజీపీ స్పష్టం చేశారు.