మేడిగడ్డ ఘటనలో కుట్ర కోణం.. కేసు నమోదు చేసిన పోలీసులు
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీని ధ్వంసం చేసినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైంది.
By అంజి Published on 25 Oct 2023 7:46 AM IST
మేడిగడ్డ ఘటనపై కుట్ర కోణం.. కేసు నమోదు చేసిన పోలీసులు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీని ధ్వంసం చేసినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిర్యాదుపై, మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో తెలియని వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 427, పబ్లిక్ ప్రాపర్టీ (నష్టం నివారణ) చట్టం సెక్షన్ 3 కింద ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేయబడింది. కాగా పిల్లర్లు కుంగిపోవడం పై కుట్ర ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ. రవికాంత్ తన ఫిర్యాదులో అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో విధుల్లో ఉండగా బ్యారేజీపై పెద్ద శబ్దం వినిపించిందని తెలిపారు. అతను L&T యొక్క ఫోర్‌మన్ బిద్యుత్ దేబ్‌నాథ్‌తో కలిసి రోడ్డు వంతెనతో పాటు బ్యారేజీని పరిశీలించాడు. ఎడమ ఒడ్డున ఉన్న బ్లాక్ 7లోని 19, 20, 21 నంబర్‌ల పీర్ల వద్ద కొంత నష్టం జరిగింది. పిల్లర్ నంబర్ 20పై ఉన్న స్లాబ్‌లు, పారాపెట్ గోడ చెదిరిపోయాయి.
విధ్వంసం జరిగిందనే అనుమానంతో సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాతో తెలంగాణను కలిపే గోదావరి నదిపై ఉన్న బ్యారేజీ వంతెనను తాత్కాలికంగా మూసివేశారు. L&T ద్వారా నిర్మించబడిన బ్యారేజీ 1.6 కిలోమీటర్ల పొడవు, పాక్షికంగా మునిగిపోయిన భాగం మహారాష్ట్ర నుండి 356 మీటర్ల దూరంలో ఉంది.
కేంద్రం పంపిన ఆరుగురు సభ్యుల నిపుణుల బృందం మంగళవారం బ్యారేజీని పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం బ్యారేజీని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. KLIP ఇంజనీర్-ఇన్-చీఫ్ N. వెంకటేశ్వర్లు, L&T అధికారులతో కలిసి వచ్చిన బృందం అక్టోబర్ 21 న జరిగిన సంఘటనపై నీటిపారుదల అధికారులతో మాట్లాడారు. బ్యారేజీలో కొంత భాగం మునిగిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన జలశక్తి మంత్రిత్వ శాఖ బ్యారేజీ పిల్లర్లు మునిగిపోవడానికి గల కారణాలను పరిశీలించేందుకు కమిటీని పంపింది.
బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని ప్రాజెక్టు ఇంజినీర్లు ప్రకటించారు. నష్టాన్ని అంచనా వేసిన తర్వాత మరమ్మతులు చేపడతామని తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమైంది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డిజైన్‌లో లోపం, పనుల్లో నాణ్యత తక్కువగా ఉందని ఆరోపించారు. ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తమ ఆరోపణను ఈ ఘటన రుజువు చేసిందని ఆరోపించారు.