తెలంగాణలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది
By Srikanth Gundamalla
తెలంగాణలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. ఇందుకు ఏర్పాట్లను చేస్తోంది. కాగా.. తెలంగాణ వ్యాప్తంగా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో పాటు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు.
సెప్టెంబర్ ఆరవ తేదీన ఓటరు జాబితా ముసాయిదా నోటిఫికేషన్‌ను వెలువరించి.. అభ్యంతరాలను స్వీకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి చెప్పారు. ఇక సెప్టెంబర్ 21వ తేదీ నాటికి తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అన్నింటినీ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ పార్థసారథి చెప్పారు. వచ్చే నాలుగైదు నెలల వ్యవధిలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. తొలుత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలూ ఉంటాయని తెలిపారు. చివరగా మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని మున్సిపల్ కమిషనర్ పార్థసారథి చెప్పారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 600 ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
ఒక కుటుంబంలోని ఓట్లు అన్నింటినీ ఒకే చోట ఉండేలా జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులకు చెప్పారు. అలాగే ఒక వార్డులోని ఓట్లు మరో వార్డుకు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ మాడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆవిష్కరించారు.