తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. గెలుపు గుర్రాలు ఎవరో తేలేది నేడే!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

By -  అంజి
Published on : 13 Feb 2026 8:19 AM IST

Telangana Municipal Election Results, Municipal Counting Updates, 116 Municipalities 7 Corporations, Ballot Paper Counting TS

తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. గెలుపు గుర్రాలు ఎవరో తేలేది నేడే!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు నిర్ణీత కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,981 వార్డుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 12,944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 123 కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు నడుమ లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగడంతో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత సాధారణ ఓట్లను లెక్కిస్తున్నారు. వార్డుల వారీగా బ్యాలెట్ పత్రాలను వేరు చేసి, ప్రతి వెయ్యి ఓట్లను (ఒక రౌండ్) ఒక కట్టగా కట్టి లెక్కిస్తున్నారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తూ లెక్కింపు జరుపుతున్నారు.

లెక్కింపు కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. గెలిచిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీన (ఫిబ్రవరి 16, 2026) పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటితో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా ముగియనుంది.

Next Story