తెలంగాణ గవర్నర్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత పదజాలం
Telangana MLC’s abusive language against Governor sparks big row. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత
By అంజి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చెసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ తన సీటు కింద పెట్టుకొని కూర్చుంటారా.. అంటూ అనుచిత పదజాలాన్ని ఎమ్మెల్సీ ఉపయోగించారు. ఇది రాజ్యాంగమా అంటూ నిలదీశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి.. ఈ కామెంట్స్ చేశారు.
బిల్లులకు సంబంధించిన ఫైళ్లు గవర్నర్ దగ్గర పెట్టుకుంటే ఏం సమాధానం చెబుతావంటూ ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర శాసన మండలి సభ్యుడు పి.కౌశిక్ రెడ్డి తెలుగులో అసభ్య పదజాలంతో దూషించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని నెటిజన్లు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ తన ప్రసంగం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై పరోక్షంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాష్ట్ర రాజకీయాలు మారాయి.
కాగా, గవర్నర్‌పై కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. 'బిల్లుల ఆమోద ప్రక్రియపై కనీసం అవగాహన లేని కౌశిక్ లాంటి నీచమైన వ్యక్తులకు కెసిఆర్ పదవులు కట్టబెట్టారు. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వారిపైకి ఊరకుక్కల విడిచిపెట్టారు. ఈ వ్యాఖ్యల వెనుక ఆయన హస్తం లేకపోతే ఎమ్మెల్సీ ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. లేదంటే బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదు' అని హెచ్చరించారు.
2021లో సామాజిక సేవా కేటగిరీలో గవర్నర్ కోటా కింద కౌశిక్ రెడ్డిని శాసనమండలికి నామినేట్ చేయాలన్న క్యాబినెట్ సిఫార్సును ఆమె ఆమోదించకపోవడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఫైల్‌ను క్లియర్ చేయడంలో గవర్నర్ ఆలస్యం చేయడంతో, బీఆర్‌ఎస్ ప్రభుత్వం కౌశిక్ రెడ్డిని శాసనసభ సభ్యుల (ఎమ్మెల్యేలు) కోటా కింద ఎగువ సభకు పంపింది.