ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలున్నా రుణమాఫీ: మంత్రి తుమ్మల

తెలంగాణలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం.

By Srikanth Gundamalla  Published on  20 July 2024 11:52 AM GMT
Telangana, minister tummala,  farmer crop loan,

ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలున్నా రుణమాఫీ: మంత్రి తుమ్మల

తెలంగాణలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. రూ.2లక్షల రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటగా రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తున్నారు. క్రమంగా రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. కాగా.. రైతురుణమాఫీ విషయంలో ఆందోళన నెలకొంది. కొందరు తమ రుణాలు మాఫీ కాలేదంటూ బ్యాంకులకు క్యూ కడుతున్నారు. ఈ విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి.. రైతులకు క్లారిటీ ఇచ్చారు.

ఈ మేరకు శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులు ఎవరూ రుణమాఫీ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఒక్క కుటుంబంలో నాలుగు ఖాతాలు ఉంటే నాలుగు అకౌంట్స్‌కు రుణమఫీ జరుగుతుందని మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఆధార్, బ్యాంకు అకౌంట్, ఆర్‌బీఐ తప్పిదాల వల్ల రుణమాఫీ రిజెకట్ అయితే 24 గంటల్లోనే వివరణ ఇస్తారని చెప్పారు. రైతులు ఆందోళన చెందొద్దని పాత పద్ధతిలోనే రుణమాఫీ అమలు అవుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

ఇక సాంకేతిక అంశాల కారణంగా ఇబ్బంది కలిగితే ప్రతీ బ్యాంకు వద్ద అధికారులు ఈవిషయంపై అందుబాటులో ఉంటారని మంత్రి తుమ్మల చెప్పారు. రుణమాఫీపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారనీ.. వారి వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రుణమాఫీ మొత్తం సెప్టెంబర్ నెల పూర్తి అయ్యేలోపు రైతుల ఖాతాలోకి జమ అవుతాయన్నారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్ కట్టే బడాబాబులు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలు ఉన్నాయనీ.. వారందరికీ రుణమాఫీ జరుగుతుందని పేర్కొన్నారు.

Next Story