Telangana: రైతుభరోసాపై మంత్రి తుమ్మల కీలక అప్‌డేట్
తెలంగాణలో రైతు పంటపెట్టుబడి సాయాన్ని పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో పేర్కొంది
By Srikanth Gundamalla Published on 26 May 2024 8:00 AM GMTTelangana: రైతుభరోసాపై మంత్రి తుమ్మల కీలక అప్‌డేట్
తెలంగాణలో రైతు పంటపెట్టుబడి సాయాన్ని పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో పేర్కొంది. రైతుభరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇస్తామని చెప్పింది. ఇక ఆరుగ్యారెంటీల్లో దీన్ని కూడా చేర్చింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధునే ఎకరానికి రూ.10వేలు జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది కూడా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ పంటపెట్టుబడి సాయం అందించారు. మిగిలిన వారికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
కాగా.. పెంచిన పంటపెట్టుబడి సాయం ఎప్పటి నుంచి అందిస్తారా అని రైతులు ఎదురు చూస్తున్నారు. తాజాగా రైతుభరోసా రూ.15వేల సాయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్‌డేట్ ఇచ్చారు. రానున్న వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. పంట వేసుకున్న రైతులకే దీన్ని వర్తింప చేస్తామని ఆయన మరోసారి స్పష్టంగా చెప్పారు. జూన్‌లో ఎన్నికల కోడ్ ముగియగానే రైతుభరోసాపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి రైతులు, రైతు సంఘాల నాయకులను ఆహ్వానించి అభిప్రాయాలు తీసుకుంటామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. శాసనసభలో, మంత్రి మండలిలో చర్చించి పథకం అమలు చేస్తామని చెప్పారు. కౌలుదార్లు సాఉగ చేస్తే వారికే నిధులు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మరోవైపు గత ప్రభుత్వం రూ.లక్ష మాఫీయే సరిగ్గా అమలు చేయలేకపోయిందని మంత్రి తుమ్మల విమర్శలు చేశారు. ఇప్పుడు తాము రూ.2లక్షల రుణమాఫీని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఒకే దఫాలో మొత్తం రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారనీ.. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2లక్షల లోపు పంట రుణాలపై వాస్తవ గణాంకాలు ఇవ్వాలని బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని మంత్రి తుమ్మల చెప్పారు. అంతేకాదు.. అకాల వర్షాలు, వరదలతో పంట దెబ్బతిన్న రైతులను ఆదుకునేలా పంటబీమా పథకం ఉంటుందని మంత్రి తుమ్మల అన్నారు.