ఆ సమయంలో తీసుకున్న రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తాం: మంత్రి పొన్నం
రైతు రుణమాఫీ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 4:08 PM ISTఆ సమయంలో తీసుకున్న రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తాం: మంత్రి పొన్నం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాక ముందు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేసింది. ఇప్పటికే దాదాపు అందరికీ రుణాలు మాఫీ అయ్యాయి. కొందరికి మాత్రం రుణామాఫీ జరగలేదు. దాంతో.. ఆ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా వారికి క్లారిటీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ . రైతు రుణమాఫీ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ మేరకు మాట్లాడుతూ రైతు రుణమాఫీపై ఈ కామెంట్స్ చేశారు. రుణమాఫీపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము కచ్చితంగా 2018 డిసెంబర్ 12వ తేదీ నంచి 2023 డిసెంబర్ 9 లోపు రూ.2 లక్షల రుణాలు పొందిన రైతులందరికీ మాఫీ డబ్బులు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర తమ ప్రభుత్వానిదే అన్నారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసినప్పటికీ 8 సీట్లు కూడా దాటలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను క్రమంగా అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఇక రాఖీ పండుగను రాష్ట్రంలో ఎంతో సంతోషంగా జరుపుకొన్నారని అన్నారు. ఇందులో భాగంగా ప్రయాణికులు ఆరోజు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ సదుపాయాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. ఈ పండగ రోజు ఏకంగా ఆర్టీసీకి రూ.15 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. ఇక సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ.. ఈ విషయంపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లుగా కూలుస్తామని మాట్లాడుతున్నారనీ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.