Telangana: రుణమాఫీ అవ్వని వారి కోసం స్పెషల్ డ్రైవ్: పొన్నం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 1:23 AM GMTTelangana: రుణమాఫీ అవ్వని వారి కోసం స్పెషల్ డ్రైవ్: పొన్నం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతులు రుణమాఫీ లబ్ది పొందారు. అయితే.. కొన్ని చోట్ల మాత్రం కొన్నికొన్ని కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. అలాంటి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. అర్హులై ఉండి, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారందరి రుణాలను మాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
రుణమాఫీ కోసం అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతుభరోసా తదితరాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. హరీశ్‌రావు ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపి 3 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయలేదని చెప్పారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటల బీమా లేక, పరిహారం అందక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడు పెట్టిన కాల్‌సెంటర్లు అప్పుడు పెడితే రైతులకు మేలు జరిగి ఉండేది కదా అన్నారు. అప్పుడేమో కలెక్షన్ సెంటర్లు పెట్టారని అన్నారు. వారి ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సులను ఆర్డర్ చేస్తే ఇప్పుడు మేము రిబ్బన్ కట్ చేస్తున్నామా? అదే నిజమైతే ఆ క్రెడిట్ వారికే ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క బస్సునైనా కొనుగోలు చేశారా? అని ప్రశ్నించారు. తెచ్చిన రూ.6 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ ఎవరు చెల్లిస్తున్నారు? అని నిలదీశారు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్ మాజీమంత్రి హరీశ్‌రావుపై మండిపడ్డారు.