Telangana: నేరుగా వారి అకౌంట్లలోకి రూ.16,500
తెలంగాణలో వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని ముందే చెప్పింది.
By Srikanth Gundamalla Published on 10 Sep 2024 1:55 AM GMTతెలంగాణలో వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని ముందే చెప్పింది. ఈ మేరకు వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. నేరుగా వరద బాధితుల అకౌంట్లలోకే రూ.16,500 చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్పారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా బాధితుల అకౌంట్లలోనే ఆర్థిక సాయం జమ చేస్తామని చెప్పారు. అయితే.. గతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించిన సమయంలో రూ.10,000 ఆర్థిక సాయంగా అందిస్తామని చెప్పారు. కానీ.. జరిగిన నష్టాన్ని చూసిన తర్వాత మానవతా దృక్పథంతో ఆర్థిక సాయాన్ని రూ.16,500కు పెంచామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఆర్థిక సాయం వెంటనే బాధితులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల ప్రభావంపై సెక్రటెరియట్‌లో సమావేశం నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. బాధితులందరికీ ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక వరదల వల్ల భూమి, ఆస్తి హక్కు పత్రాలు, ఇతర చదువులకు సంబంధించిన సర్టిఫికెట్లను కోల్పోయారని ఆయన అన్నారు. వారి కోసం పోలీస్‌స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయిస్తామన్నారు. అక్కడ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి.. డూప్లికేట్ పత్రాలను అందిస్తారని మంత్రి పొంగులేటి వెల్లడించారు.