ప్రభుత్వ భూమి అంగుళమైనా ఆక్రమణకు గురికావొద్దు: మంత్రి పొంగులేటి
తెలంగాణ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
By Srikanth Gundamalla Published on 29 Sept 2024 8:45 PM ISTతెలంగాణ ప్రజల సంక్షేమం.. వారికి మేలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట నల్సార్ యూనివర్సీటీలో 33 జిల్లాల తహశీల్దార్లతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమిని కాపాడుకుందామన్నారు. ఎవరు ఆక్రమణ చేయకుండా చూసుకోవాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. తహసీల్దార్ల బదిలీలపై త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమీక్ష నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన సేవలను అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేక మైనది అని చెప్పారు. అందరి కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు జోడెద్దుల్లా పనిచేసి
ప్రజలకు ఉత్తమ సేవలందించాలనీ.. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 972 మంది తహశీల్దార్లు ఉన్నారని చెప్పారు. గ్రామ, మండల స్థాయిలో ఉండే సమస్యలు, ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రెవెన్యూ చట్టాల సవరణకు.. క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలపై మీరు ఇచ్చే సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటామనీ.. పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ల సమావేశంలో చెప్పారు.