ధరణిని ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు: మంత్రి పొంగులేటి
తెలంగాణ సచివాలయంలో తన చాంబర్‌లో ధరణి కమిటీ సభ్యులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla
ధరణిని ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు: మంత్రి పొంగులేటి
తెలంగాణ సచివాలయంలో తన చాంబర్‌లో ధరణి కమిటీ సభ్యులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో సమస్యలపై ఆరా తీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంత తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షల కుటుంబాలు భూసమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఈ సమస్యల నుంచి ప్రజలను బయటపడేసేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి, భూ వ్యవహహారాలకు సంబంధించిన చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. అందుకు చర్యలను ప్రారంభించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా అధ్యయనం చేయకుండా ధరణి పోర్టల్‌ను తెచ్చిందన్నారు మంత్రి పొంగులేటి. దాంతో.. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ధరణిని ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమస్యలను అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని చెప్పారు. కమిటీ సిఫార్సులను సమావేశంలో చర్చించామనీ.. కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే ముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అవుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
ధరణి పోర్టల్‌ను బలోపేతం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. తద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా, అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా మార్పులు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం పార్ట్-బిలో ఉంచిన భూ సమస్యలను పరిష్కరించానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.