బీజేపీ నాయకులకు భయం పట్టుకుంది: మంత్రి హరీశ్‌రావు
Telangana Minister Hrish Rao Fire On Bjp Leaders. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో తమకు సంబంధం లేదని బీజేపీ చెబుతున్న విషయం తెలిసిందే.
By అంజి Published on 10 Nov 2022 7:41 PM ISTటీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో తమకు సంబంధం లేదని బీజేపీ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై స్పందించిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్‌లో మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చిన మఠాధిపతులు, స్వామిజీలు తెలియదని చెప్పిన బీజేపీ.. ఎందకు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తుందో చెప్పాలన్నారు. అసలు సంబంధం లేని కేసులో దర్యాప్తు ఆపాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. దీని వెనక బీజేపీ కుట్ర ఉందని హరీశ్ రావు ఆరోపించారు. అందుకే సిట్ విచారణ ఆపాలని కోరుతున్నారని అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్టపగలు దొరికిన బీజేపీ దొంగల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల మారిపోయిందన్నారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుదని హరీష్ రావు అన్నారు. ప్రభుత్వం వారిని అరెస్టు చేసి జైలుకు పంపిందని, దీంతో బీజేపీ నాయకుల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డంత పనైందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో మఠాధిపతులను, స్వామిజీలను తెలంగాణలో నగ్నంగా ప్రభుత్వం బయటపెట్టిందని హరీశ్ రావు అన్నారు.
''పార్టీ అధ్యక్షుడేమో తడి బట్టలతో ప్రమాణం చేస్తానని అంటాడు. ఈ కేసును విచారణ చేయొద్దని బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అంటాడు. ఈ కేసు విచారణ ఆపండి. ఢిల్లీకి ఇవ్వండంటూ కోర్టుల్లో పిటిషన్ వేస్తాడు. తడిబట్టలు, పొడిబట్టలు, ప్రమాణాలు అంటున్నారు. కేసు విచారణ ఆపాలనేమో పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టుల్లో కేసులు వేస్తాడు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టి తెలంగాణకు వచ్చి, దొరికిపోయేసరికి కుడితిలో పడ్డంత పనైంది'' అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
మొన్ననేమో ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. పాదర్శకంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిట్ ఏర్పాటు చేస్తే, రద్దు చేయాలని కోర్టులో కేసు వేశారు. బీజేపీ బండారం బయటపడుతదనో ఉద్దేశంతో, దీన్ని ఆపాలని చూస్తున్నారు. పరువు కాపాడుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. నిజాన్ని ఒప్పుకోవడమే మీ ముందున్న మార్గం. మరో గత్యంతరం లేదు. బీజేపీ నాయకులను ప్రజలు గమనిస్తున్నారు.