త్వరలోనే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌: మంత్రి హరీష్‌ రావు

Telangana Minister Harish Rao on group-4 job notification. తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు మరో గుడ్‌న్యూస్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

By అంజి  Published on  13 Nov 2022 4:14 PM IST
త్వరలోనే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌: మంత్రి హరీష్‌ రావు

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు మరో గుడ్‌న్యూస్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలిపారు. ఆదివారం ఉదయం సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూల్‌లో పోలీసు ఉద్యోగాల శిక్షణ పొందుతున్న సుమారు 300 మంది అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు తన సొంత ఖర్చులతో పాలు, ఉడికించిన గుడ్లు పంపిణీ చేశారు. మంత్రి చొరవతో ఎస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ లో భాగంగా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ఫిజికల్ ఫిట్ నెస్ శిక్షణ శిబిరం తరగతులు నిర్వహిస్తున్నారు.

ప్రిలిమినరీ రాత పరీక్ష కోసం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 70 రోజుల పాటు సిద్దిపేట, గజ్వేల్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు 1030 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ శిబిరంలో 580 మందికి పైగా అభ్యర్థులు శిక్షణ ద్వారా అర్హత సాధించారు. రెండోదశలో ఆసక్తి ఉన్న వారికి టార్ఫిడ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల పట్టణాల్లో దేహదారుఢ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మిగిలి ఉంది కాబట్టి మీరందరూ జాబ్ కోసం కఠోర సాధన చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని తెలిపారు. వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్ల ద్వారా అమలు చేస్తామని మంత్రి వివరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తోందని హరీశ్ రావు అన్నారు.

Next Story