జలదిగ్భందంలో మణుగూరు.. వరదలో విషసర్పాలు..భయం భయం

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  1 Sept 2024 7:53 AM IST
జలదిగ్భందంలో మణుగూరు.. వరదలో విషసర్పాలు..భయం భయం

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణం కూడా జలదిగ్భందనంలో ఇరుక్కుంది. ఇళ్ల మధ్యలోకి వరద నీరు చేరిపోయింది. దాంతో.. మణుగూరు పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు వరద ఇబ్బంది పెడుతుంటే.. మరో భయం మణుగూరు వాసులను భయపెడుతోంది. వరద నీటిలో విషసర్పాలు కొట్టుకు వస్తున్నాయి. జనావాసాల్లో వచ్చి కలకలం సృష్టిస్తున్నాయి. దాంతో.. జనాలు ఆందోళనకు గురవుతున్నారు.

మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్‌, ఆదర్శనగర్‌, కాళీమాత ఏరియా, పైలట్‌ కాలనీ, వినాయక్‌నగర్‌, అశోక్‌నగర్‌, పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దాదాపుగా అన్ని ఇళ్లలోకి వరద నీరు చేరిపోయింది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. కొందరు ఇళ్ల డాబాలపై నివాసం ఉంటున్నారు. అయతే.. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు స్థానికులు. పలు ప్రాంతాల్లో వరద నీటిలో విష సర్పాలు నేరుగా ఇళ్లలోకి చేరాయి. దాంతో.. జనాలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు చర్యలు తీసుకోవాలని.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. మణుగూరు ప్రధాన రహదారిపై అరకిలోమీటరు మేర వరద నీరు చేరింది. దాంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్‌ ఈ మేరకు ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలకు సహాయం అందించాలని పోలీసులను ఆదేశించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Next Story