తెలంగాణలో త్వరలోనే మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి
తెలంగాణలో త్వరలోనే మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్‌లను ఏర్పాటు చేయబోతున్నామని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 13 Jun 2024 5:37 PM ISTతెలంగాణలో త్వరలోనే మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి
తెలంగాణలో త్వరలోనే మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్‌లను ఏర్పాటు చేయబోతున్నామని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇవి ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. తెలంగాణలో క్యాంటీన్ సర్వీసుల ఏర్పాటుపై సచివాలయంలో పలువురు అధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసుల ఏర్పాటు.. నిర్వహణ సహా తదితర అంశాలపై చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను తీసుకొస్తున్నామని సీఎస్ శాంతి కుమారి చెప్పారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కలెక్టరేట్లు, అన్ని ప్రధాన కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు సహా పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. ఇప్పటికే అన్న క్యాంటీన్ల పేరుతో కేరళ, దీదీకా రసోయ్ అనే పేరుతో బెంగాల్‌లో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేశామన్నారు. రాబోయే రెండు ఏళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎస్ శాంతి కుమారి చెప్పారు.
మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను గ్రామైక్య సంఘాలకు అప్పగిస్తామని సీఎస్ చెప్పారు. క్యాంటీన్ నిర్వహణ కోసం తామే ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇక క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటు ఎంత విస్తీర్ణంలో ఉండాలి.. రోడ్‌మ్యాప్ సహా ఇతర వివరాలపై ప్రణాళికలు రూపొందిస్తామన్నారు సీఎస్ శాంతి కుమారి. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు.