ఎన్నికల ప్రచారంలో వీటికి అనుమతి లేదు: వికాస్‌ రాజ్

లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  18 March 2024 5:27 PM IST
telangana, lok sabha election, vikas raj,

ఎన్నికల ప్రచారంలో వీటికి అనుమతి లేదు: వికాస్‌ రాజ్ 

లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

రాబోయే ఎన్నికల కోసం రాష్ట్రంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సీఈవో వికాస్‌ రాజ్ చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అన్ని భద్రత చర్యలు తీసుకున్నామన్నారు. లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఎన్నికల కోసం లక్షా 80వేల మంది సిబ్బంది అవసరమని చెప్పారు. ఇక ఈసారి 85 ఏళ్లు పైబడిన వారికి హోం ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు అవకాశం పొందడం కోసం అర్హులు ఏప్రిల్ 22వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. ఇందుకు ఫారం-డీ పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని వికాస్‌ రాజ్‌ చెప్పారు.

మరోవైపు ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని వికాస్‌ రాజ్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 90వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 3.30 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. 8 లక్షల మంది కొత్త యువ ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్ చెప్పారు. పోస్టల్ ఓటింగ్ కొత్త సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిర్హహిస్తామని తెలిపారు. ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయనీ.. రిజర్వ్‌ కూడా ఉంచామన్నారు. 50వేల రూపాయల కంటే ఎక్కువ నగదుతో తిరిగితే చెక్‌పోస్టుల వద్ద పేపర్స్‌ చూపించాల్సి ఉంటుందని అన్నారు. లేదంటే సీజ్‌ చేస్తామని చెప్పారు. ఇక రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు అనుమతి సువిదా యాప్‌ ద్వారా తీసుకోవాలని చెప్పారు. రోడ్‌ షోలు సెలవు రోజుల్లోనే అనీ.. రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్‌షోలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు వాడకూడదని చెప్పారు. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలు, స్కూల్‌ డ్రెస్‌లకు అనుమతి ఉండదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్ అన్నారు.

Next Story