Telangana: ఎన్నికల వేళ రాష్ట్రంలో రూ.104.18 కోట్లు పట్టివేత
లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 29 April 2024 7:45 AM ISTTelangana: ఎన్నికల వేళ రాష్ట్రంలో రూ.104.18 కోట్లు పట్టివేత
లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా.. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న నగదు.. మద్యం సహా ఇతరత్రా వస్తువులను సీజ్ చేస్తున్నారు. తెలంగాణలో కూడా పోలీసులు ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున వాహన తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు రూ.104.18 కోట్లను పోలీసు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల కోసం 477 ఎఫ్‌ఎస్‌టీ, 464 ఎస్‌ఎస్‌టీ బృందాలు 89 సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు మద్యం, డ్రగ్స్, ఉచితాలను పంపిణీ చేసేందుకు తీసుకెళ్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పట్టుబడ్డ మొత్తం సొత్తు వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు. తనిఖీల్లో మొత్తం రూ.63.18 కోట్ల నగదు దొరకిందని చెప్పారు. పెద్దమొత్తం నగదు పట్టుబడటం కలకలం రేపుతోందని అంటున్నారు. ఇక రూ.5.38 కోట్ల విలువైన మద్యం, రూ.7.12 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.21.34 కోట్ల విలువైన ఆభరణాలతో పాటు రూ.6.91 కోట్ల విలువైన ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 7,174 లైసెన్స్‌డ్ ఆయుధాలను పోలీసులకు డిపాజిట్ చేయగా.. అనధికారంగా ఉన్న 14 ఆయుధాలను సీజ్ చేశామని పోలీసులు చెప్పారు.