Telangana: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక చర్యలు
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కీలక చర్యలను చేపట్టనున్నట్లు తెలిపింది ఈసీ.
By Srikanth Gundamalla Published on 3 April 2024 9:30 PM ISTTelangana: ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కీలక చర్యలు
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. ఇక మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌కు నాయకులు వరుస షాక్‌లు ఇస్తున్నారు. పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. అయితే.. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచే బాధ్యతను కూడా ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఈ మేరకు కీలక చర్యలను చేపట్టనున్నట్లు తెలిపింది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులు కీలక చర్యలు తీసుకోనున్నారు. పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకుంది ఈసీ. బీఆర్కే భవన్‌లో ఓటర్ అవెర్నెస్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రైల్వే, పెట్రోలియం సంస్థల్లో ఓటర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిఘా మరింత పెంచామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలింపు, నిల్వలు చేస్తే చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఈ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలను జారీ చేశారు సీఈవో వికాస్ రాజ్.