లాస్య నందిత మృతి కేసులో కీలక మలుపు
దివంగత బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 1 March 2024 12:15 PM ISTలాస్య నందిత మృతి కేసులో కీలక మలుపు
దివంగత బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. లాస్య కారుని ఢీకొట్టిన టిప్పర్ లారీని పటాన్‌చెరు పోలీసులు గుర్తించారు. కాగా.. ఓఆర్ఆర్‌పై లాస్య నందిత కారు ముందుగా టిప్పర్‌ను డీకొట్టింది. దాని వల్లే లాస్య నందిత చనిపోయింది. టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు వెనుక నుంచి ఢీకొట్టినా టిప్పర్‌ను ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా లారీని గుర్తించారు పటాన్‌చెరు పోలీసులు.
ఫిబ్రవరి 27వ తేదీన లాస్య నందిత కారు పటాన్‌చెరు వద్ద ఓఆర్ఆర్‌పై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లాస్య నందిత దుర్మరణం చెందారు. ముందు సీట్లో కూర్చొని సీటుబెల్టు పెట్టుకున్నా.. ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయినా కూడా ఆమె ప్రాణాలు కోల్పోయారు. మెడ విరిగిపోవడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. లారీని ఢీకొట్టిన తర్వాతే కారు రోడ్డు పక్కన ఉన్న రేలింగ్‌ను ఢీకొట్టింది. ఇక ఇదే ప్రమాదంలో కారు డ్రైవర్, లాస్య నందిత పీఏ ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు కాళ్లు విరిగిపోయాయి. దాంతో.. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అతన్ని కూడా విచారణ చేస్తున్నారు. మరోవైపు గతేడాది ఫిబ్రవరిలోనే లాస్య నందిత తండ్రి సాయన్న అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు.