Telangana: జూనియర్ డాక్టర్ల సమ్మె.. నిలిచిన వైద్యసేవలు
తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేపట్టారు.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 11:45 AM ISTTelangana: జూనియర్ డాక్టర్ల సమ్మె.. నిలిచిన వైద్యసేవలు
తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని రకాల విధులను తాము బహిష్కరించామని పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జీరీలు, వార్డు డ్యూటీలు నిలిచిపోయాయి.
తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు తాము విధుల్లోకి వెళ్లబోము అని జూనియర్ డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. దాదాపు 4వేల మంది ఈ నిరవధిక సమ్మెలో పాల్గొన్నట్లు వెల్లడించారు. స్టయిఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్లు పరిష్కరించాలంటూ ఈ నెల 19వ తేదీన ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాము నోటీసు ఇచ్చి కూడా నాలుగు రోజులు అవుతోందనీ.. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వారు తెలిపారు. అందుకే నిరవధిక సమ్మెను చేపడుతున్నట్లు జూనియర్ డాక్టర్లు వెల్లడించారు.
గత నెలలో కూడా ఒకసారి ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని జూనియర్ డాక్టర్లు గుర్తు చేశారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. అయితే నెల రోజులు పూర్తయినా ఒక్క హామీ కూడా పూర్తవకపోవడంతో జూన్ 19న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు జూనియర్ డాక్టర్లు. ఆ తర్వాత నిరసన తెలిపారు. నల్ల రిబ్బన్లు, నలుపు డ్రెస్‌లు వేసుకుని విధులకు వచ్చారు. ఆదివారం కళ్లకు నల్ల గంతకలు కట్టుకుని నిరసన తెలిపారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరవదిక సమ్మెకు పిలుపునిచ్చారు.
జూనియర్ డాక్టర్ల డిమాండ్లు
* ప్రతి నెలా పదో తేదీలో గా స్టైఫండ్ జమ చేసేలా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయాలి
* సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం ఇవ్వాలి
* పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే దక్కేలా ఉత్తర్వులు ఇవ్వాలి
* ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోలీసులతో భద్రత కల్పించాలి
* ఉస్మానియా దవాఖానాకు కొత్త భవనం నిర్మించాలి
* కాకతీయ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో అంతర్గత రోడ్లు వేయాలి
* ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పనకు డిమాండ్