FLASH: నార్సింగిలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్‌

మూసీ నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం నార్సింగిలో ధర్నాకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...

By -  అంజి
Published on : 3 March 2026 8:47 PM IST

Kavitha Arrested, Telangana Jagruthi, Narsingi Protest, Musi River Encroachments, HYDRAA Demolitions, Commissioner Ranganath, Telangana Political News, BRS vs Congress

FLASH: నార్సింగిలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్‌

హైదరాబాద్‌: మూసీ నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం నార్సింగిలో ధర్నాకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానికులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఆమెను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడ ఓ బిల్డర్‌ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా బుల్డోజర్లు కూల్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. పోలీసుల తీరుపై మండిపడ్డ కవిత, ప్రభుత్వం కేవలం పేదల ఇళ్లను కూల్చడానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.

పెద్దలకొక రూల్.. పేదలకొక రూలా?: మూసీ రివర్ బెడ్‌లో బడా బాబులు నిర్మిస్తున్న భారీ భవనాలను ప్రభుత్వం ఎందుకు వదిలేస్తోందని ఆమె ప్రశ్నించారు. పేదలు వేసుకున్న గుడిసెలను మాత్రం కనికరం లేకుండా కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలపై విరుచుకుపడే హైడ్రా (HYDRAA) బుల్డోజర్లు ఇక్కడి అక్రమ నిర్మాణాల వద్దకు ఎందుకు రావడం లేదు? కమిషనర్ రంగనాథ్ దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

సామాన్యులకు 30 మీటర్ల బఫర్ జోన్ నిబంధనలు వర్తింపజేస్తున్న ప్రభుత్వం, కొందరు పెద్దల భవనాలు నదికి కేవలం 5 మీటర్ల దూరంలో ఉన్నా ఎలా అనుమతిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తన పంథా మార్చుకోకపోతే తెలంగాణ జాగృతి తరపున బాధితుల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని కవిత పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో కవితతో పాటు పలువురు జాగృతి నాయకులు కూడా ఉన్నారు.

Next Story