చోరీకి గురైన ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ టాప్
చోరీకి గురైన స్మార్ట్ ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలిచింది.
By - Srikanth Gundamalla |
చోరీకి గురైన ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ టాప్
దొంగలు రద్దీగా ఉన్న ప్రదేశాలను టార్గెట్ చేసుకుని పర్సులు.. మొబైల్ ఫోన్లను ఈజీగా కొట్టేస్తుంటారు. పర్సులు అంటే దొరక్కపోవచ్చు కానీ.. మొబైల్ ఫోన్లు అలాకాదు. వాటిని ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. అలా స్మార్ట్ ఫోన్లు దొంగతనానికి గురైనా, పోగొట్టుకున్నా సులభంగా రికవరీ చేసే టెక్నాలజీ వచ్చింది. తెలంగాణ పోలీసు కూడా ఈ టెక్నాలజీని ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంతటి ఫోన్ అయినా సులభంగా రివకరీ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలిచింది.
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న, దొంగిలించిన మొబైల్ ఫోన్‌ల రికవరీలో తెలంగాణ అన్ని రాష్ట్రాలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. డేటా ప్రకారం సీఈఐఆర్ పోర్టల్‌ను ఉపయోగించి తెలంగాణలో 39 శాతం ఫోన్లను రాష్ట్ర పోలీసులు రికవరీ చేశారు. సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ నేతృత్వంలో మొబైల్స్ రికవరీ కొనసాగింది. ఫోన్ల రికవరీలో టాప్‌లో నిలిచిన సందర్భంగా పోలీసులను రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. ఈ ఘనత సాధించడంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. మొత్తం 189 రోజుల్లో 10,018 స్మార్ట్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటిలో చివరి కేవలం 14 రోజుల్లో 1000 ఫోన్లను యజమానులకు అందించారు పోలీసులు. ఇక తెలంగాణ తర్వాత 36 శాతం రికవరీతో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 30 శాతం ఫోన్ల రికవరీతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. కాగా.. 2023 ఏప్రిల్ 20వ తేదీ నుంచి 2023 అక్టోబర్ 26 వరకు ఇందులో మొత్తం 86,395 ఫోన్‌లు బ్లాక్ చేయగా, 25,598 ట్రేస్‌బిలిటీ నివేదికలు అందాయి. 10,018 ఫోన్‌లు అన్‌బ్లాక్ చేశారు.
మొబైల్ దొంగతనం, నకిలీ మొబైల్ పరికరాలను అరికట్టడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) CEIR పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది మే 17న అధికారికంగా దేశవ్యాప్తంగా ప్రారంభించిన పోర్టల్ 2023 ఏప్రిల్ 19 నుంచి తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడింది. దీనిని రాష్ట్రంలోని అన్ని 780 పోలీస్ స్టేషన్‌లలో నిర్వహించబడుతుంది.