Telangana: భైంసాలో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి

మార్చి 5న నిర్మల్ జిల్లా భైంసాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మార్చ్ నిర్వహించేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

By అంజి  Published on  28 Feb 2023 10:02 AM GMT
Telangana High Court , RSS rally , Bhainsa

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్: మార్చి 5న నిర్మల్ జిల్లా భైంసాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మార్చ్ నిర్వహించేందుకు తెలంగాణ హైకోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. 500 మందికి మించకుండా ర్యాలీ నిర్వహించాలని, ప్రార్థనా స్థలాలకు 300 మీటర్ల దూరంలో నిర్వహించాలని రైట్‌వింగ్ సంస్థను హైకోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించుకోవాలని సూచిచింది. ఎలాంటి నేరచరిత్ర లేనివారే ర్యాలీలో పాల్గొనాలని రైట్‌వింగ్‌ సంస్థను ఆదేశించిన హైకోర్టు.. ప్రార్థన మందిరాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయానలి పోలీసులకు సూచించింది. అలాగే ర్యాలీలో పాల్గొనేవారు ఎలాంటి కాంట్రవర్సీ కామెంట్స్‌ చేయొద్దని కోరింది.

ఇంటలిజెన్స్ రిపోర్టు ఆధారంగా ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతిని నిరాకరించినట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇంటలిజెన్స్ రిపోర్టును హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది అందించారు. భైంసా అత్యంత సున్నితమైన ప్రాంతమని, రెండేళ్ల క్రితం భైంసాలో జరిగిన అల్లర్ల విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే టిప్పు సుల్తాన్‌ జన్మదినం నాడు ర్యాలీకి సైతం పోలీసులు పర్మిషన్‌ ఇచ్చారని పిటిషనర్‌ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఫిబ్రవరి 19 ఆదివారం భైంసాలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాద సంచలన్ (మార్చ్)కు దరఖాస్తు చేసుకోగా.. పోలీసులు అనుమతి నిరాకరించగా, ర్యాలీ అనుమతి కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Next Story