ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీనిపై స్పందించిన రాష్ట్ర హైకోర్టు.. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని, వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా సీరియస్ అంశమని పేర్కొంది. వారంలో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భోజనం విరామం తర్వాత పూర్తి వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది.
నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో నిన్న మళ్లీ ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని మాగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం పలువురిని మక్తల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇద్దరు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించారు. మధ్యాహ్న భోజనానికి ముందు 22 మంది విద్యార్థులు బేకరీలు, దుకాణాల్లో తినుబండారాలు తిన్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురి కాలేదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు.