టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ కు ఎట్టకేలకు ఊరట లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు అయిన వనమా రాఘవకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా ఉండాలని, ప్రతి శనివారం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టాలనే షరతులు విధించింది. షరతులు ఉల్లగించినట్లయితే బెయిల్ రద్దు చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. వనమా రాఘవ 61 రోజుల పాటు జైలులో ఉన్నారు.
పాత పాల్వంచకు చెందిన మీ సేవ నిర్వాహకుడు నాగరామకృష్ణ.. భార్య, ఇద్దరు కుమారైలతో కలిసి జనవరి నెలలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రామకృష్ణ బలవన్మరణం అనంతరం.. సూసైడ్ నోటుతో పాటు పలు సెల్ఫీ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోల్లో తన చావుకు కారణం వనమా రాఘవే కారణమని నాగరామకృష్ణ చెప్పారు. తన సోదరి, తల్లితో ఉన్న ఆస్తి వివాదంలోకి వనమా రాఘవ వచ్చి.. తనను మానసిక ఆవేదనకు గురి చేశాడని, అంతేకాకుండా తన భార్యను కూడా గదిలోకి పంపాలని ఒత్తిడి చేశాడని ఆరోపించారు.
సెల్పీ వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు వనమా రాఘవను అరెస్ట్ చేశారు. ఈ కేసులు బెయిల్ కోసం పలుమార్లు రాఘవ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.