'లిఫ్ట్ భద్రతా చట్టం ఎక్కడా?'.. ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్
తెలంగాణలో పెరుగుతున్న బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో లిఫ్టుల భద్రతపై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది.
By - అంజి |
'లిఫ్ట్ భద్రతా చట్టం ఎక్కడా?'.. ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్
తెలంగాణలో పెరుగుతున్న బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో లిఫ్టుల భద్రతపై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. లిఫ్టు ప్రమాదాల కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నా, నిబంధనల రూపకల్పనలో జరుగుతున్న జాప్యంపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి తుది హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో లిఫ్టుల నిర్వహణ, భద్రతకు సంబంధించి ప్రత్యేక చట్టం లేకపోవడంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ గౌస్ మీరా మోహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది.
నివాస, వాణిజ్య భవనాల్లో లిఫ్టుల భద్రతను పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో బలమైన చట్టబద్ధమైన వ్యవస్థ లేకపోవడాన్ని కోర్టు ఎత్తిచూపింది. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే చట్టాలు ఉన్నా, తెలంగాణలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించింది. ఈ చట్టం తీసుకురావడానికి మరో ఆరు నెలల సమయం కావాలని ప్రభుత్వ ప్లీడర్ కోరగా, కోర్టు దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా, ఈ అంశాన్ని ఎందుకు ప్రాధాన్యత క్రమంలో చేర్చలేదని నిలదీసింది. లిఫ్టులలో సాంకేతిక లోపాల వల్ల ప్రాణాలు పోతున్న సంఘటనలు పునరావృతం కావడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రతిపాదిత 'తెలంగాణ లిఫ్ట్స్ యాక్ట్-2025' ముసాయిదాను నాలుగు వారాల్లోగా కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఇకపై ఎటువంటి గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. చట్టం అమల్లోకి వచ్చే వరకు, పిటిషనర్ సూచించిన భద్రతా మార్గదర్శకాలను ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ద్వారా తక్షణమే అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అడ్వకేట్ బర్కత్ అలీ ఖాన్ 2025లో రాసిన లేఖ ఆధారంగా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) కోర్టు విచారణకు స్వీకరించింది. హై-రైజ్ బిల్డింగ్స్‌లో లిఫ్టుల భద్రతను గాలికి వదిలేయడం వల్ల జరుగుతున్న మరణాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.