వివేకా హత్య కేసు: ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసిన హైకోర్టు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు

By అంజి  Published on  27 April 2023 12:47 PM IST
Telangana High Court, Erra Gangireddy, YS Viveka murder case

వివేకా హత్య కేసు: ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేసిన హైకోర్టు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు ఏ1 ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు గంగిరెడ్డిని వచ్చే నెల 5వ తేదీలోగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించామని, లొంగిపోకుంటే గంగిరెడ్డిని అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలిపింది. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ-1) ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. అయితే బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కేసు విచారణ జరుగుతున్న తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

వివేకా హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డి అని, దానిని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాడని దర్యాప్తు సంస్థ వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సాక్ష్యాలను తారుమారు చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అతడి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ వాదించింది. వివేకా కేసులో సీబీఐ విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాలని, జూన్ 30 వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జూలై 1 తర్వాత గంగిరెడ్డికి మళ్లీ బెయిల్ మంజూరు చేయవచ్చని హైకోర్టు తెలిపింది.

గతంలో వివేకా హత్య కేసును తొలుత ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరిపింది. 90 రోజులు గడిచిపోయినా గంగిరెడ్డిపై సిట్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. రూల్స్‌ ప్రకారం.. నిందితులపై 90 రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలి. లేని పక్షంలో సాంకేతిక కారణాలతో బెయిల్ లభిస్తుంది. ఇదే కారణంతో గంగిరెడ్డి బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. 2019 జూన్ 27న గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Next Story