తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు ఎండలు తీవ్రం కానున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని, ఏప్రిల్ 14 వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
ముఖ్యంగా ఏప్రిల్ 10 నుండి 12 మధ్య ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో మాత్రం 36 నుండి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండవచ్చు.
తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దాహం వేయకపోయినా సరిపడా నీళ్లు తాగాలని వాతావరణ శాఖ సూచించింది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ఓఆర్ఎస్, లస్సీ, నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని నిపుణులు సలహా ఇచ్చారు.