త్వరలో మరో 2,929 పోస్టులకు నోటిఫికేషన్.. మంత్రి దామోదర కీలక ప్రకటన

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.

By -  అంజి
Published on : 30 March 2026 7:23 AM IST

Telangana Health Ministry, Damodara Rajanarsimha, Medical Recruitment Telangana, TIMS Hospitals, Warangal Super Specialty, Aarogyasri Updates, Government Doctors Workload, New Dialysis Centers

త్వరలో మరో 2,929 పోస్టులకు నోటిఫికేషన్.. మంత్రి దామోదర కీలక ప్రకటన

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులపై ఉన్న పనిభారాన్ని తగ్గించేందుకు వైద్య సేవలు, పరిపాలనాపరమైన బాధ్యతలను వేరు చేయనున్నట్లు వెల్లడించారు. బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 9,572 పోస్టులను భర్తీ చేశామని, మరో 7,267 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే వైద్య శాఖలో మరో 2,929 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ ఆరోగ్య సూచికలు మెరుగ్గా ఉన్నాయని ఆయన వివరించారు. గత రెండేళ్లలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారు 9.5 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. డయాలసిస్ రోగుల కోసం రాష్ట్రవ్యాప్తంగా అదనంగా మరో 79 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లోని టిమ్స్ (TIMS) ఆస్పత్రులు మరియు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.

వైద్య సౌకర్యాల విస్తరణలో భాగంగా సెకండరీ స్థాయి ఆస్పత్రుల్లో 5 పీజీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల జిల్లాల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బోధనాస్పత్రుల్లో ఈ ఏడాది అదనంగా 11 సీటీ స్కాన్ యంత్రాలు, 8 ఆస్పత్రుల్లో ఎంఆర్‌ఐ (MRI) సేవలను ప్రారంభిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యం కోసం 145 పాలీక్లినిక్స్‌ను, హైదరాబాద్‌లో 7 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Next Story