ఇందిరమ్మ ఇళ్లు పథకంలో అవినీతిపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల పథకం'లో భారీ కుంభకోణం జరుగుతోందంటూ ములుగు జిల్లాకు చెందిన...
By - అంజి |
ఇందిరమ్మ ఇళ్లు పథకంలో అవినీతిపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల పథకం'లో భారీ కుంభకోణం జరుగుతోందంటూ ములుగు జిల్లాకు చెందిన ఒక మహిళ రాసిన లేఖపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిని సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ములుగు జిల్లాకు చెందిన తిప్పల సాయి భవాని అనే వితంతువు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలపై హైకోర్టుకు లేఖ రాశారు. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికలో మండల, గ్రామ స్థాయి అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
అర్హులైన పేదలను గుర్తించడానికి బదులుగా, ఒక్కో ఇంటి కేటాయింపు కోసం అధికారులే నేరుగా ₹50,000 నుండి ₹1 లక్ష వరకు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. తాను కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నానని, అయితే అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించకుండా కేవలం కాగితాల మీద తప్పుడు సర్వేలు సృష్టించి తన దరఖాస్తును తిరస్కరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక రాజకీయ నాయకులు కూడా ఈ పథకాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బు కూడబెడుతున్నారని, ఆ సొమ్మును మళ్ళీ అధిక వడ్డీలకు 'మైక్రో ఫైనాన్స్' రుణాల రూపంలో తిప్పుతున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై CBI లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తో లోతైన విచారణ జరిపించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పి. సామ్ కోశి మరియు జస్టిస్ నర్సింగరావు నందికొండలతో కూడిన ధర్మాసనం.. దీనిపై మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), ములుగు జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులను ఆదేశించింది.