'విచారణకు హాజరు అవ్వండి'.. కాంగ్రెస్ వ్యూహకర్తకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

Telangana HC asks Congress strategist to appear before police. హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్‌మీడియాలో

By అంజి  Published on  3 Jan 2023 3:12 PM IST
విచారణకు హాజరు అవ్వండి.. కాంగ్రెస్ వ్యూహకర్తకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్‌మీడియాలో అవమానకరమైన పోస్టులు పెట్టినందుకు గాను కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కానుగోలుకు తెలంగాణ హైకోర్టు మంగళవారం హైదరాబాద్‌ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తనకు సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సునీల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది, అయితే అతనిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.

సైబర్ క్రైమ్ పోలీసులు అతనికి సెక్షన్ 41 (ఎ) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద నోటీసు అందించారు. అతని వివరణతో డిసెంబర్ 30 న తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. అయితే, రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహాలను రూపొందించడానికి తెలంగాణ కాంగ్రెస్ నియమించిన సునీల్ కానుగోలు హైకోర్టులో నోటీసును సవాలు చేశారు. సమన్ల అమలుపై స్టే ఇవ్వాలని వ్యూహకర్త హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబరు 30న అతడు పోలీసుల ఎదుట హాజరుకాకపోవడంతో, జనవరి 8న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.

నోటీసు ప్రకారం.. ఆర్. సామ్రాట్ ఫిర్యాదుపై నవంబర్ 24న భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 469 (పరువుకు హాని కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ), 505 (2) (శత్రుత్వం, ద్వేషాన్ని సృష్టించడం లేదా ప్రోత్సహించే ప్రకటనలు) కింద కేసు నమోదు చేయబడింది. మాదాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ వార్‌రూమ్‌పై పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న రెండు వారాల తర్వాత మొదటి నోటీసు జారీ చేయబడింది. సోదాల్లో ల్యాప్‌టాప్‌లు, సీపీయూలు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులు 'తెలంగాణ గళం', 'అపన్న హస్తం' పేర్లతో సోషల్ మీడియాలో కించపరిచే పోస్ట్‌లు చేస్తున్నారని తెలిపారు.

డిసెంబర్ 13న పోలీసులు కానుగోలు కార్యాలయం, మైండ్‌షేర్ యునైటెడ్ ఫౌండేషన్‌పై దాడి చేసి కానుగోలు కార్యాలయంలో పనిచేస్తున్న మెండ శ్రీ ప్రతాప్, శశాంక్, త్రిశాంక్ శర్మలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత ముగ్గురినీ విడిచిపెట్టారు. సునీల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చుతామని మరుసటి రోజు ఒక పోలీసు అధికారి ప్రకటించారు. పోలీసుల చర్య ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్న ప్రతిపక్ష పార్టీ నుండి తీవ్ర ప్రతిస్పందనను రేకెత్తించింది. ఈ దాడికి వ్యతిరేకంగా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.

Next Story