ఇవాళే పట్టభద్రుల ఉపఎన్నిక కౌంటింగ్.. ఫలితానికి రెండ్రోజులు పట్టే చాన్స్..!
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఇవాళ ప్రారంభం కానుంది.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 7:48 AM ISTఇవాళే పట్టభద్రుల ఉపఎన్నిక కౌంటింగ్.. ఫలితానికి రెండ్రోజులు పట్టే చాన్స్..!
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఇవాళ ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ కొనసాగుతుంది. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడేందుకు రెండ్రోజుల వరకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా.. గత నెల 27వ తేదీన నియోజకవర్గ పరిధిలోని ఓటింగ్ జరిగింది. ఈ ఉపఎన్నికలో మొత్తం 72.44 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాంలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. బ్యాలెట్ అన్నింటిని బండిల్స్‌గా కట్టి.. ఆ తర్వాత కౌంటింగ్‌ను మొదలుపెడతారు. మద్యాహ్నం వరకు బండిల్స్ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోజన విరామం తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడుతలుగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు.
పట్టభద్రుల ఉపఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి విజయం తేలకపోతే.. రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటించనున్నారు. మొత్తం 96 టేబుళ్లపై కౌంటింగ్ కొనసాగుతుంది. 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఈ ఓట్లను బ్యాలెట్ బాక్సుల వారీగా తీసుకొచ్చి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్‌గా కడుతారు. బండిల్స్ కట్టడానికే యాంత్రం 4 గంటల వరకు సమయం పడుతుందని సమాచారం. మొదట తొలి ప్రాధాన్యం ఓట్లు లెక్కింపు చేస్తారు. ఇక ఎన్నికల కౌంటింగ్ కోసం 2800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ అసిస్టెంట్లు 37 మంది ఏఆర్‌వోలు, 40 మంది తహసీల్దార్లను నియమించారు. అదేవిధంగా 12 జిల్లాల నుంచి మరో 300మంది సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144సెక్షన్ అమలు చేస్తారు.