ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్.. జూన్ 5న ఫలితాలు
తెలంగాణలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
By Srikanth Gundamalla
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్.. జూన్ 5న ఫలితాలు
తెలంగాణలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఉపఎన్నికలో మొత్తం 49 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ పోటీ చేశారు. మూడు జిల్లాలో పరిధిలో ఉన్న 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉండగా.. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. ప్రాధాన్యత ఓటు పద్ధతి అయినందున ఈవీఎంలను వినియోగించే అవకాశం లేదు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వైలెట్ రంగు పెన్నుతో ప్రాధాన్యతను టిక్ చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలుకి సిరా చుక్కా పెట్టారు. ఇంకా అది తుడిచిపెట్టుకుపోలేదు. దాంతో.. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఎడమ చేయి మధ్యన వేలువకి సిరాను వేశారు. కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేసే అవకాశం ఉండదు.
మరోవైపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. మద్యం దుకాణాలను మూసివేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమల్లో ఉంచారు. సాయంత్రం 4 గంటల వరకు వరుసలో నిలబడ్డ వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జూన్ 5వ తేదీన వెల్లడించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్ఎల్సీ స్థానానికి 2021 మార్చిలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నిక అయ్యారు. అయితే.. గత 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామన నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ఈ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికను ఎన్నికల సంఘం నిర్వహించింది.