Telangana: 4 లక్షల మంది బాలికలకు.. ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ టీకాల పంపిణీ
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది. అయితే, దీనిని నివారించదగిన ఏకైక క్యాన్సర్‌గా వైద్యులు పేర్కొంటారు.
By - అంజి |
Telangana: 4 లక్షల మంది బాలికలకు.. ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ టీకాల పంపిణీ
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది. అయితే, దీనిని నివారించదగిన ఏకైక క్యాన్సర్‌గా వైద్యులు పేర్కొంటారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 14 నుండి 15 ఏళ్ల వయస్సున్న సుమారు 4 లక్షల మంది బాలికలకు ఉచితంగా HPV (Human Papillomavirus) వ్యాక్సిన్‌ను అందించాలని నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.2 నుంచి 4 వేలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఏటా 4 వేల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే వ్యాధి రాకముందే అరికట్టేందుకు ప్రభుత్వం ఫ్రీగా వ్యాక్సిన్ వేయనుంది.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 14-15 ఏళ్ల బాలికలు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) నుంచి రక్షణ కల్పించేందుకు, క్యాన్సర్ రహిత తెలంగాణను నిర్మించడం మరియు మహిళల్లో మరణాల రేటును తగ్గించడం లక్ష్యంగా ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చాలా మంది మహిళల్లో ఈ క్యాన్సర్ లక్షణాలు బయటపడేసరికి అది ముదిరిపోయి ఉంటుంది.
చిన్న వయస్సులోనే (లైంగిక సంపర్కానికి ముందు) ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, వైరస్ దాడి చేయకుండా అడ్డుకుంటుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ ధర వేలల్లో ఉంటుంది, కానీ ప్రభుత్వం దీనిని ఉచితంగా అందించడం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థినులకు ఎంతో మేలు చేకూరుతుంది. వైద్య ఆరోగ్య శాఖ మరియు విద్యాశాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. పాఠశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అర్హులైన బాలికలకు టీకాలు వేయనున్నారు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు కృషి చేయనున్నారు.