తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే ఏప్రిల్ నెల నుంచి 3 నుంచి 6 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజూ 100 ఎంఎల్ పాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. 'ఆరోగ్యలక్ష్మి' పథకంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ నూతన పౌష్టికాహార కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లల్లో కాల్షియం, ప్రోటీన్ల కొరతను నివారించి, వారిని శారీరకంగా ధృడంగా మార్చడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
ముందుగా ఈ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించగా, అక్కడ అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. గత నవంబర్ నుండి 640 అంగన్వాడీల్లోని దాదాపు 8 వేల మంది చిన్నారులకు పాలు అందించడం వల్ల వారి హాజరు శాతం పెరగడమే కాకుండా, తక్కువ బరువు ఉన్న పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది. ఈ సానుకూల మార్పును గమనించిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ స్కీమ్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాలకు విస్తరించాలని నిశ్చయించుకుంది. దీనివల్ల సుమారు 4.50 లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ భారీ ప్రాజెక్టు కోసం రోజుకు దాదాపు 45 వేల లీటర్ల పాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు వారానికి మూడు రోజులు పాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో, సరఫరా బాధ్యతలపై కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ములుగులో విజయ డెయిరీ ద్వారా పాలు అందుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ పెరగనుండటంతో కర్ణాటకకు చెందిన 'నందిని' (KMF) డెయిరీ సేవలను కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే రెండు సంస్థల ప్రతినిధులతో ప్రాథమిక చర్చలు ముగిశాయి.