హైదరాబాద్: సెలవు పెట్టకుండా విధులకు హాజరవ్వని టీచర్లపై కొరడా ఝులిపించేందుకు రాష్ట్ర విద్యాశాఖ రెడీ అయ్యింది. 30 రోజులు పాఠశాలకు హాజరుకాకపోతే వారి ఇంటికే స్వయంగా నోటీసులు పంపించనుంది. నోటీసులకు టీచర్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. కాగా ఎఫ్‌ఆర్ఎస్(ఫెషీయల్ రికగ్నిజేషన్ సిస్టమ్) వచ్చాక టీచర్ల హాజరు శాతం పెరిగినట్టు సమాచారం. గత రెండేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా విధులకు హాజరుకాని 50 మంది టీచర్లను సర్వీస్ నుంచి విద్యాశాఖ తొలగించింది.
ఇకపై చెప్పా పెట్టకుండా సెలవు పెట్టడం, లివ్ లెటర్ ఇవ్వకుండా 30 రోజుల పాటు స్కూల్‌కు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్, మిడ్ డే మీల్ అమలు తదితర అంశాలపై జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో ఆన్‌లైన్‌లో సమీక్ష చేపట్టారు.
ఈ క్రమంలోనే టీచర్ల హాజరుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని డీఈవోలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. పర్మిషన్ లేకుండా నెల రోజుల పాటు సెలవు తీసుకుంటే నోటీసు ఇచ్చి, విచారణ చేసి, ఉద్యోగం నుంచి తొలగించాలని డీఈవోలకు సూచించారు. రాష్ట్రంలోని దాదాపు 24 వేల స్కూళ్లలో సుమారు 1.15 లక్షల మంది టీచర్లు ఉన్నారు.