ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, మొత్తం 1.25 కోట్ల అప్లికేషన్లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది.
By Srikanth Gundamalla
ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, మొత్తం 1.25 కోట్ల అప్లికేషన్లు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 6వ తేదీతో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఈ కార్యక్రమం ముగింపు నాటికి దాదాపు 1,25,84,383 అప్లికేషన్లు వచ్చాయి. ఇక ప్రజాపాలన చివరి రోజు ఏకంగా 16,90,278 దరఖాస్తులు వచ్చాయి. కాగా.. ఈ దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ వరకు అధికారులు అన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ప్రతి రోజూ డేటా ఎంట్రీలు చేసే విధంగా చూడాలని జిల్లాల కలెక్టర్లను అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 28 నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది.
తెలంగాణలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం కొనసాగింది. 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులను స్వీకరించారు అధికారులు. ఇందులో గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఆరు గ్యారెంటీల కోసం వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒకే దరఖాస్తులు కావాల్సిన గ్యారెంటీల కోసం అప్లికేషన్ తీసుకున్నారు. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం, చేయూత పథకం, కొత్త రేషన్ కార్డుల కోసం వినతి పత్రాలు స్వీకరించారు.
మరోవైపు ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ముగియగానే వెంటనే డేటా ఎంట్రీ చేటపట్టాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వచ్చిన అప్లికేషన్‌లను ఆన్‌లైన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగానే డీటీపీ ఆపరేటర్లను నియమించింది. ఇప్పటికే వీరికి ప్రత్యేక శిక్షణ కూడా పూర్తి చేశారు అధికారులు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సిబ్బందితో వేగంగా పని జరగకపోతే మరికొందరిని కూడా నియమించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈనెల 17వ తేదీ వరకు డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత అర్హులను అధికారులు గుర్తించనున్నారు.