Telangana: గ్రూప్-2 వాయిదా ఆలోచనలో ప్రభుత్వం.. మళ్లీ ఎప్పుడంటే?

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  19 July 2024 7:45 AM IST
Telangana govt, group-2 exams, postpone demand ,

Telangana: గ్రూప్-2 వాయిదా ఆలోచనలో ప్రభుత్వం.. మళ్లీ ఎప్పుడంటే?

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు.. డీఎస్సీ పరీక్షలను కూడా వాయిదా వేయాలని నిరసనలు తెలిపారు. కానీ.. డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం 18వ తేదీ నుంచే నిర్వహిస్తోంది. కాగా.. గ్రూప్‌-2 పరీక్షలపై మాత్రం వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్‌-2 పరీక్షలు ఉండటం వల్ల వాటిని వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు ఇది వాయిదా పడుతూనే వచ్చింది. ఇప్పుడు డీఎస్సీ పరీక్షలు జులై 18వ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిరుద్యోగులు మరోవైపు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో వాయిదా నిర్ణయం ప్రభుత్వం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే గ్రూప్‌-2 పరీక్ష వాయిదాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

గ్రూప్‌-2 పరీక్షను ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే ప్రశ్న నిరుద్యోగుల్లో ఉంది. మరోవైపు అధికారులు కూడా దీనిపై తర్జనభర్జన పడుతున్నారు. జాతీయ స్థాయి పరీక్షల షెడ్యూల్‌ చూసుకుని కొత్త తేదీలు ప్రకటించాల్సి ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఈ పరీక్షలు వాయిదా పడితే.. మళ్లీ నవంబరు లేదా డిసెంబరులో నిర్వహించే అవకాశం ఉంది. రెండు మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గ్రూపు-2 పరీక్షల వాయిదా అంశంపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మానవతారాయ్‌ తదితరులు గురువారం నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.

Next Story