Telangana: మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.. దేశంలోనే మొట్టమొదటిదిగా..
తెలంగాణలో పోలీసు, పైర్, ఎస్పీఎఫ్, జైళ్ల శాఖల ఉద్యోగుల పిల్లల భవిష్యత్తు కోసం ఒక నూతన అధ్యాయానికి అడుగు పడింది.
By అంజి Published on 22 Oct 2024 2:18 AM GMTTelangana: మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.. దేశంలోనే మొట్టమొదటిదిగా..
తెలంగాణలో పోలీసు, పైర్, ఎస్పీఎఫ్, జైళ్ల శాఖల ఉద్యోగుల పిల్లల భవిష్యత్తు కోసం ఒక నూతన అధ్యాయానికి అడుగు పడింది. హైదరాబాద్ మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.
పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంలో చెప్పినట్టుగానే పోలీసు కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. స్కూల్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
సైనిక్ స్కూల్ తరహాలో దేశంలోనే మొట్టమొదటిదిగా పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేకంగా స్కూల్ నిర్మించనుండగా, ఇందులో స్థానికులకు 10 శాతం మేరకు అడ్మిషన్లు కల్పించాలన్న స్థానిక ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి 15 శాతం అడ్మిషన్లు స్థానికులకు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి శ్రీధర్ బాబు వేదిక నుంచి ప్రకటించారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో హోంగార్డు నుంచి డీజీపీ వరకు వారి కుటుంబాల పిల్లలందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. మంచిరేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలోని 50 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్ నిర్మాణం చేపడతారు. పోలీస్ స్కూల్ లో చదువుకున్నామని గొప్పగా చెప్పుకునేలా విద్యతో పాటు స్పోర్ట్స్, గేమ్స్ కావలసిన అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. మొదటగా 5 నుంచి 8 వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం ఈ స్కూల్ ప్రారంభమవుతుందని సీఎం తెలిపారు.