నర్సుల హోదాను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది హోదాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 7 Oct 2023 1:47 AM GMTనర్సుల హోదాను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలో నర్సులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాకారం అయ్యింది. తమ వృత్తికి, చేస్తున్న సేవకు మరింత గౌరవం తెచ్చేలా 'ఆఫీసర్' అని పిలిపించుకోవాలన్న కోరికను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది హోదాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. శనివారం నుంచి ఉత్వర్వులు అమలవుతాయని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. ఈ ఉత్తర్వులతో తెలంగాణ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 14వేల మంది నర్సులకు ప్రయోజనం చేకూరనుంది.
స్టాఫ్ నర్స్‌ను నర్సింగ్ ఆఫీసర్‌గా, హెడ్ నర్స్‌ని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా పిలవాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఇక నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2ను, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ వన్‌ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా వెంటనే మార్చాలని జీవోలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పబ్లిక్ హెల్త్ సైడ్ ఆసుపత్రుల్లో పనిచేసే పబ్లిక్ హెల్త్ నర్స్ పోస్టును పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్‌గా మార్చింది తెలంగాణ ప్రభుత్వం. డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల్లో ఎలాంటి మార్పు చేయడం లేదని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న నర్సుల హోదాను పెంచి.. గౌరవం పెంచేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్వాగతించింది. నర్సుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందీనయమని అన్నారు. తమకు సమాజంలో మరింత గౌరవం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. పీహెచ్‌సీలు స్థాయి నుంచి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన దవాఖానల వరకు కేకులు కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. పలుచోట్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
నర్సుల గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి పేరును ఉన్నతీకరించాలని నర్సులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. వివిధ హోదాల్లో పేర్లు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ రుడావత్ హర్షం వ్యక్తం చేశారు.