దీపావళి సెలవు తేదీ మార్చిన తెలంగాణ.. వరుసగా మూడ్రోజులు హాలీడేస్
దీపావళి పండగ సెలవు తేదీని తెలంగాణ ప్రభుత్వం మార్చింది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 7:51 AM GMTదీపావళి సెలవు తేదీ మార్చిన తెలంగాణ.. వరుసగా మూడ్రోజులు హాలీడేస్
దీపావళి పండగ సెలవు తేదీని తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ముందుగా దీపావళి సెలవు రోజుని ఈ నెల 12వ తేదీగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ తేదీని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రకారం దీపావళి సెలవు నవంబర్ 13వ తేదీకి మార్చింది. ఈ మేరకు మార్చిన సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రతి ఏటా తెలంగాణ సర్కార్ ఎంప్లాయిస్‌కు ఇచ్చే సాధారణ సెలవుల జాబితాను ముందు సంవత్సరం డిసెంబర్‌లోనే విడుదల చేస్తుంది. ఆ జాబితా ప్రకారం అయితే.. నవంబర్ 12వ తేదీనే దీపావళి సెలవు కూడా ఇచ్చారు. అయితే.. తాజాగా పండితుల సలహా మేరకు సెలవు దినాన్ని మార్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 13వ తేదీకి దీపావళి సెలవు దినాన్ని మార్చారు అధికారులు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. దాంతో.. నవంబర్ 13న దీపావళి సెలవు ఉండనుంది. ఈ రోజున ఉద్యోగులతో పాటు ఆఫీసులు, వ్యాపార సంస్థలు, పాఠశాలలకు కూడా నెగోషియబుల్ చట్టం కింద సెలవు వర్తించబోతుంది.
తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో వరుసగా మూడ్రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. నవంబర్ 11న రెండో శనివారం కాగా.. నవంబర్ 12న ఆదివారం ఎలాగూ సెలవు దినం. ఇక నవంబర్ 13న సోమవారాన్ని దీపావళి హాలీడేగా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. తద్వారా మూడ్రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ప్రతీ సంవత్సరం దీపావళి సెలవును (తిథి ద్వయం నాడు) తిధుల ఆధారంగా నిర్ణయిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈసారి కూడా గవర్నమెంట్‌కు వచ్చిన సలహాలు, వినతుల మేరకు దీపావళి సెలవు దినాన్ని మార్చినట్లు తెలుస్తోంది.