తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను జుమాతుల్-విదా, షబ్-ఎ-ఖదర్, ఈద్-ఉల్-ఫితర్ పండుగలకు సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ ప్రకారం, జుమాతుల్-విదా సెలవు మార్చి 13 (శుక్రవారం)న, షబ్-ఎ-ఖదర్ సెలవు మార్చి 17 (మంగళవారం)న ఉండనున్నాయి. ఈ రెండింటిని ఐచ్ఛిక సెలవులుగా ప్రభుత్వం పేర్కొంది.
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) సెలవులు
రంజాన్ పండుగకు సంబంధించి మార్చి 21, మార్చి 22 తేదీలను సాధారణ సెలవులుగా ప్రభుత్వం జాబితా చేసింది. అయితే, ఈ సెలవులు చంద్ర దర్శనం ఆధారంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ మార్చి 19న నెలవంక కనిపిస్తే, పండుగను మార్చి 20న జరుపుకుంటారు. అప్పుడు సెలవుల తేదీల్లో మార్పు ఉంటుంది. కానీ జుమాతుల్-విదా, షబ్-ఎ-ఖదర్ సెలవుల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో సందడి
రంజాన్ మాసం చివరి 10 రోజుల్లో అమ్మకాలు భారీగా పెరుగుతాయన్న అంచనాతో హైదరాబాద్‌లోని వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చార్మినార్, పాతబస్తీ పరిసరాల్లోని దుకాణాలు కొత్త స్టాక్‌తో కొలువుదీరుతున్నాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 10వ నెల అయిన షవ్వాల్ మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. చంద్ర దర్శనంపై తుది నిర్ణయం తీసుకోవడానికి మార్చి 19న 'మూన్ సైటింగ్ కమిటీ' సమావేశం కానుంది.