తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం, 1948 సెప్టెంబర్‌లో భారతదేశంతో దాని ఏకీకరణకు సంబంధించిన చిత్రాలు, ఆర్ట్‌లు ఎగ్జిబిషన్‌లో ఉన్నాయి. విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు జరుపుకుంటున్న వేడుకల్లో భాగంగా ఈ ఫొటో, ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
ప్రజా తిరుగుబాటులో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుల చిత్రాలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సెప్టెంబర్ 17, 1948న 'ఆపరేషన్ పోలో' అనే కోడ్ పేరుతో చేపట్టిన పోలీసు చర్య ముగిసిన తర్వాత నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం చేయబడింది.
ఫొటో ఎగ్జిబిషన్ సందర్భంగా.. స్వాతంత్ర్య సమరయోధుల కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులను గవర్నర్ తమిళిసై సత్కరించారు. గవర్నర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 హైదరాబాద్ నిజాం నుంచి విముక్తి పొందిందన్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో కూడా విమోచన దినోత్సవాన్ని ఒక కార్యక్రమంగా జరుపుకుంటున్నాయని అన్నారు. పరకాల ఊచకోతతో పాటు బైరన్‌పల్లిలో 90 మందికి పైగా నాయకులను రజాకార్లు దారుణంగా హతమార్చిన రోజును ఎలా మర్చిపోగలమన్నారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వందేమాతరం గీతాన్ని ఆలపించిన తీరును గవర్నర్ గుర్తు చేసుకున్నారు. భారత్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాదును భారత యూనియన్‌లో విలీనం చేశారని, ఈ చరిత్రను రాబోయే తరాలకు తెలియజేయాలన్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.