25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ సర్కార్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దం విరామం తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.
By అంజి Published on 19 July 2024 11:04 AM IST
25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ సర్కార్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దం విరామం తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఆ పార్టీ చివరిసారిగా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమర్పించిన పూర్తి బడ్జెట్.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జూలై 23న ప్రారంభం కానున్నాయి
బడ్జెట్‌ను జులై 25న ప్రవేశపెట్టనున్నప్పటికీ, శాసనసభ సమావేశాలు జూలై 23న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. సమావేశాల తొలిరోజున శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
ఫిబ్రవరి 10న, లోక్‌సభ ఎన్నికల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల పాటు ఓటింగ్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. ఇప్పుడు ఓటింగ్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై 31తో ముగియనున్నందున, గడువు కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ఆమోదించాల్సి ఉంది.
ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వం జూలై 23న తన బడ్జెట్‌ను సమర్పించబోతోంది. దీనిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. రాష్ట్రానికి కేటాయింపులు బట్టి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను సిద్ధం చేయనుంది.
అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా,రైతు రుణమాఫీ వంటి కీలక అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు, రైతుభరోసా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి పలు కీలక బిల్లలను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.