గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ఈ నెల 18వ తేదీన అమ్రాబాద్‌లోని మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపింది. ఈ మేరకు గురువారం నాడు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా ఏ.శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లలో రూ.12,600 కోట్లను ఈ పథకానికి వెచ్చించనున్నట్టు వివరించింది. పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగు నీటిని అందించడమే ఈ పథకం లక్ష్యమని స్పష్టం చేసింది.
ప్రస్తుత సంవత్సరం(2025-26)లో రూ.600 కోట్ల ను ఖర్చు చేయనుండగా, తదుపరి 4 ఏళ్ల పాటు ఏడాదికి రూ.3వేల కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. పథకం అమలుకు ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులను వినియోగించనున్నారు. ఈ స్కీమ్ కింద పోడు పట్టాలు పొందిన భూముల్లో బోర్లు వేయడం, వాటికి సోలార్ పంపు సెట్లు అందించడం సహా మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. 100 శాతం రాయితీతో ఈ స్కీమ్‌ను గిరిజన రైతులకు అందించనున్నారు. మండలాల వారీగా ఈ నెల 25 వరకు ప్రభుత్వం అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించనుంది.