హైదరాబాద్: కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు అయిన వారి వివరాలతోపాటు.. పాత రేషన్ కార్డులో కొత్తగా చేరిన 30 లక్షల మంది లబ్ధిదారుల వివరాలను అధికారులు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 5.61లక్షల మందికి రేషన్ కార్డులు జారీ అయ్యాయి. ఈ కార్డుల ద్వారా 27.87 లక్షల మంది సభ్యులుగా చేరారు. దీంతో పాటు రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యుల నమోదుతో ఆ సంఖ్య సుమారుగా 30 లక్షలకు చేరుకుంది.
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల రాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డుల అనుసంధాన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90.10 లక్షల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తుండగా, 2.84 కోట్ల మంది అర్హులుగా ఉన్నారు. తాజా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల కుటుంబాలతో కలిపి ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య సుమారు 95-96 లక్షలకు పెరగనుంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 3.14 కోట్లకు చేరనుంది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ 10.70 లక్షల మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందాయని మంత్రి తెలిపారు. గడిచిన 20 నెలల్లో ఆస్పత్రులకు రూ.1590 కోట్లకుపైగా చెల్లించినట్టు తెలిపారు.