గిరిజన రైతులకు మేలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గిరిజన రైతులకు సాగు నీటి కష్టాలను తొలగించడానికి పూర్తి సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. బోరు వేసేందుకు అయ్యే ఖర్చుతో పాటు మోటారు కూడా ఇవ్వనుంది. ఇందిర జల ప్రభ పేరుతో అమలు చేయనున్న ఈ పథకంతో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద నాలుగు ఎకరాల లోపు భూములు సాగు చేస్తున్న 2,30,735 మంది గిరిజన రైతులకు లబ్ధి జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రతి సంవత్సరం దశల వారీగా కొంది మందికి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఏటా 50 వేల ఎకరాలకు ఈ స్కీమ్ వర్తింపజేయాలని నిర్ణయించారు. సంవత్సరానికి రూ.3 వేల కోట్లును ఈ పథకం కింద ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కో రైతుకు యూనిట్ కాస్ట్ రూ.6 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కీమ్‌ను అమలు చేసే బాధ్యత పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించింది. నోడల్ ఏజెన్సీగా ట్రైబల్ డిపార్ట్‌మెంట్ వ్యవహరించనుంది.
ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతలను ఐటీడీఏలకు ప్రభుత్వం అప్పగించనుంది. ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలోనే ఇందిర జల ప్రభ స్కీమ్‌ను ప్రకటించి నిధులు కేటాయిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పథకం అమలు కోసం సబ్ ప్లాన్ నిధులతో పాటు నీటి పారుదల, అటవీ, వ్యవసాయ, హార్టికల్చర్, పవర్, గిరిజన అభివృద్ధి శాఖల నుంచి నిధులు ఖర్చు చేయనున్నట్టు సమాచారం.