హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో పోలీస్ శాఖలో భారీగా నియామకాలు జరగనున్నాయి. పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో 12 వేల పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. 2024లో పోలీస్‌శాఖలో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరిగాయి. దీంతో పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
2022లో తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి 17 వేల పోస్టులను భర్తీ చేసింది. ఈ నియామక ప్రక్రియలో ఎంపికై, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి 2024లో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఇప్పుడు మరోసారి భారీ రిక్రూట్‌మెంట్‌కు అధికారులు సిద్ధమవుతున్నారు. 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచారు. దీంతో ఆ సంవత్సరం పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. ఆ తర్వాత నుంచి వారి పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.